వైభవంగా శ్రీ సాయిబాబా దేవాలయం 17వ వార్షికోత్సవం..
ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు... పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్, జూలై 9 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలోని శ్రీ గణపతి దత్తాత్రేయ సుప్రభాత శ్రీ శిర్డీ సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవం మహోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా కన్నుల పండువగ నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సాయిబాబా ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ, అర్చకులు గూడ రమేష్ శర్మల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశేష అభిషేకం,పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక అర్చనలు, హోమాలు, మంగళహారతులు వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, మహామంగళహారతి తర్వాత భక్తులందరికీ మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






