గాంధీ విగ్రహానికి శ్రీధర్‌బాబు నివాళి
అట్లాంటాలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి
మంథని, జూన్ 6 (విజయక్రాంతి): అమెరికాలోని అట్లాంటాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అక్కడి మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్‌ఏ (జీఎఫ్‌యూఎస్‌ఏ) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన శ్రీధర్‌బాబు.. మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, టూథర్ కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిఫ్ట్లను చూశారు.
అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, జీఎఫ్ యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్ రవి పోనంగి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ థాలియాత్, చైర్మన్ సుభాష్ రజ్జాన్ తదితరులు పాల్గొన్నారు.






