ఇంటి అనుమతులు ఇక్కడ ‘మామూలే’!
నాగర్‌కర్నూల్, జూన్ ౬ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ కార్యాలయంలో వసూళ్ల పర్వం తారాస్థాయి కి చేరుతోంది. భూబకాసురులు ప్రభుత్వ భూములను కబ్జాచేసి అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారు లు పట్టించుకోకుండా తీరా పనులు ప్రారంభించాక నోటీసులు ఇచ్చి తెర వెనుక ఖద్దరు నేతల చేత సెటిల్మెంట్‌లు చేసే ప్రక్రియకు తెరలేపారు. కబ్జా చేసిన భూమి వ్యాల్యూ బట్టి ఆ అధికారులు రేట్ ఫిక్స్ చేసుకుని వసూళ్లకు ప్లాన్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టౌన్‌ప్లానింగ్ అధికారులు కొందరి సిబ్బందిని పురమాయించి కబ్జాదారుల నుండి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీ లో విలీనం చేసిన కొన్ని గ్రామాల్లో నేటికీ గ్రామపంచాయతీ అనుమతులు, పట్టాలు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినా అవేవీ పట్టించుకోకుండా వారికి అనుమతులను ఇచ్చేస్తున్నారు. కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిలోనే కమర్శియల్ నిర్మాణాలు చేపడుతున్నా వారికి అడ్డగోలుగా అనుమతులను ఇచ్చేస్తూ ప్రభుత్వ భూములకు, ప్రభుత్వ ఆదాయానికి మంగళం పాడుతున్నారు. మరి కొన్ని నిర్మాణాలు సెట్ బ్యాక్ తీసుకోకపోయినా చేతిలో డబ్బు పెడితే చాలు వారికి అనుమతులు ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లు నిర్మించినా ఆమ్యామ్యాలకు అలవాటు పడి నిమ్మకుండిపోతున్నారు.
ప్రభుత్వ భూములన్నీ మాయం..!
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో పాటు మున్సిపాలిటీగా మారడంతో సమీప గ్రామాలైన ఉయ్యాలవాడ, నెల్లికొండ, నాగనూలు, ఎండబెట్ల గ్రామపంచాయతీలు నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆయా గ్రామాల్లో కోట్లు విలువజేసే ప్రభుత్వ భూములపై రియల్ వ్యాపారులు, కబ్జాదారులు కన్నేసారు. ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న ప్రయివేటు భూములను కొనుగోలు చేసి కొద్దికొద్దిగా ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. అందులో ముందుగా మొక్కలు, బోరుబావులు, లేదా పశువుల కొట్టం, పశుగ్రాసం ఇలా మొత్తంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇదే అనుగా భావించిన మున్సిపల్ అధికారులు వారికి ముందుగా సమీప కౌన్సిలర్ చేత బేరసారాలకు దిగుతున్నారు. వినకపోతే నోటీసులు ఇచ్చి భూమి ధరకు అనుగుణంగా రేట్ నిర్ణయించి లక్షల్లో డబ్బు దండుకుంటున్నారు. చివరకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో కోట్లు విలువజేసే ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన రెవెన్యూ అదికారులు సైతం తమవాటా తాము తీసుకుని తీమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నిబంధనలు తూచా తప్పకుండా పాటించే వారికి మాత్రం ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుటూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






