అభివృద్ధికి అంతా సహకరించాలి
జగిత్యాల, జూన్ 6 (విజయక్రాంతి): రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తర్వాత అందరూ కలిసికట్టుగా అభివృద్ధి వైపు నడవాలని ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం మేడిపల్లి మండల పరిషత్ సరసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. కేవలం సర్వసభ్య సమావేశాలప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తనకు తెలపాలని సూచించారు. అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.
రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నాణ్యమైన వరి వంగడాలను అందించాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని పేర్కొన్నారు. కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాలకు తాగు, సాగునీటి అవసరాలకు నిర్మించనున్న కలిగుట సూరమ్మ ప్రాజెక్టు పనులు తరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా గర్భిణుల్లో నమ్మకం పెంచాలని సూచించారు. రాజకీయాలకతీతంగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో జగిత్యాల జెడ్పీ వైస్ చైర్మన్ బద్దినేని హరిచరణ్ రావు, ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, మేడిపల్లి, భీమారం తహసీల్దార్లు, వసంత రవికిరణ్, ఎంపీడీవో చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.






