7 June, 2026 | 2:51 AM

కేసీఆర్ విజనరీ.. రేవంత్ మిషనరీ

07-06-2026 01:07 AM

తెలంగాణకు, పాలమూరుకు చారిత్రక, శాశ్వత ద్రోహి కాంగ్రెస్

ఎన్‌ఓసీ ఇవ్వడానికి చంద్రబాబు ఎవరు?

భట్టి పంచె కట్టుకోవద్దా?

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, జైపాల్ యాదవ్

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): సెక్రటేరియట్‌లో కూర్చున్న వాళ్ళంతా కేసీఆర్ కాలేరని, కేసీఆర్ విజనరీ లీడర్ అయితే రేవంత్ రెడ్డి మిషనరీ లీడర్ అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లు విమర్శించారు. సీఎం కోసం ప్రభుత్వ అధికారులు త్యాగం చేస్తే, కమీషన్లు సీఎం కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

రెండున్నరేళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సమయం దొరికిందని, గాలి మోటారులో వచ్చి పాలమూరు ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణకు శాశ్వత ద్రోహి, పాలమూరుకు చారిత్రక ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. పాలమూరులో జీవ నదులు వున్నా కరువు జిల్లాగా మార్చారని, జూరాల పూర్తి చేయడానికి కాంగ్రెస్, టీడీపీలు 40 ఏళ్ళు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తికి బీఆర్‌ఎస్ హయాంలో 3 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు.

మద్రాసు, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం తుంగభద్ర నుంచి పాలమూరుకు 65 టీఎంసీల నీళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం ఉందని తెలిపారు. కేసీఆర్‌ను అవమానించే విధంగా మాట్లాడి గొప్పోడిని కావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని విమర్శించారు. పాలమూరుపై రేవంత్ రెడ్డికి ఇసుక రేణువు అంత ప్రేమ లేదని, పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కేసులు వేయించిందన్నారు.

ఏపీ ప్రభుత్వం కేసులు వేసినా క్లియరెన్స్‌లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిందని, వాపస్ వచ్చిన డీపీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్‌ఓసీ ఇస్తే తెలంగాణకు నీళ్లు తెస్తారా.. ఎన్‌ఓసీ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎవరని నిలదీశారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పరిపాలన చేయడానికి ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. మేము రాజశేఖర్ రెడ్డిని మోడల్ గా తీసుకోమని, వైఎస్ తెలంగాణ వ్యతిరేకి అన్నారు.

భట్టిని దృష్టిలో ఉంచుకుని పంచె కట్టు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారని, రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులను దెప్పి పొడుస్తున్నారని, ప్రజాభవన్‌లో కూర్చుని భట్టి విక్రమార్క కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. యాదాద్రిలో కింద కూర్చోబెట్టి భట్టిని అవమానించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆలోచనలు రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో అమలు అవుతున్నాయని ఆరోపించారు. ప్రజలంతా అబ్ కి బార్ బీఆర్‌ఎస్ సర్కార్ అంటున్నారని స్పష్టం చేశారు.