calender_icon.png 30 July, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీ వర్సెస్ బీసీ..!

20-07-2024 12:20:11 AM

  1. బలరాంనాయక్ వర్సెస్ మహేష్ కుమార్
  2. పీసీసీ పీఠం కోసం పోటాపోటీ
  3. వారం, పది రోజుల్లో స్పష్టత
  4. కాంగ్రెస్‌లో రసవత్తరంగా వర్గపోరు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఇదిగో అదిగో అంటూ కొద్ది వాయిదా వేస్తూ వస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పీఠం కోసం పోటీ కాస్తా పార్టీలో వర్గపోరుగా  మారుతున్నట్టు కనపడుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా బరిలో ఉన్నారంటూ అనేక పేర్లు మొదటి నుంచి వినపడినప్పటికీ.. చివరికి ఎస్టీ వర్సెస్ బీసీ వర్గాల మధ్య పోరుగా రూపుదాల్చినట్టు పార్టీలో చర్చ మొదలైంది.

ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌లో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరో వారం, పది రోజుల్లో పీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కేరళలో ప్రకృతి చికిత్సకు వెళ్లిన ఆయన.. వారం రోజుల్లో ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. ఆయన రాగానే పీసీసీ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంటారని ఢిల్లీ వర్గాల సమాచారం.

ఒకరిని మించి మరొకరు..

పీసీసీ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ప్రయత్నించారు. అయితే ఒక్కొక్కరి పేరును అధిష్ఠానం పక్కనపెట్టేలా కాంగ్రెస్‌లోని వర్గాలు ప్రయత్నించి సఫలీకృతం అయ్యాయి. మొదట మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ పేరు బలంగా వినపడింది. అయితే ఆయనను తప్పించే క్రమంలో ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ పేరును తెరపైకి తీసుకొచ్చినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో మహబూబాబాద్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌పేరును కూడా తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. దీంతో పరిస్థితి ఎస్టీ వర్సెస్ బీసీగా మారింది.

చరిత్ర తవ్వి తీస్తోన్న వర్గాలు..

ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ పలుమార్లు బీసీ నేతలు పీసీసీ పగ్గాలు అందుకున్నారు. కే కేశవరావు, వీ హన్మంతరావు, ధర్మపురి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య పార్టీని నడిపించారు. దీంతో ఈసారి ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ముందుకు తెచ్చారు. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపారని, అందువల్ల ఎస్టీకి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని అధిష్ఠానం ముందు వాదించినట్టు తెలుస్తుంది. ఈ వాదనను బలమైన బీసీ వర్గాలు సమర్ధంగా పూర్వపక్షం చేశాయని పార్టీలో చర్చ జరుగుతున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చారని, సొంత రాష్ట్రంలో ఒక సంవత్సరం మాత్రమే పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం కల్పించినా.. రెండుమార్లు రెడ్లకే పీసీసీ పగ్గాలు అప్పగించారని మరో వర్గం గట్టిగా వాదించినట్టు సమాచారం. ఈసారి పూర్తిస్థాయిలో బీసీలకు పగ్గాలు అందివ్వాలని కోరినట్టు తెలిసింది. పైగా బీసీ జన గణన చేయాలనే నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో బీసీ వర్గానికి చెందిన మహేష్‌కుమార్ గౌడ్ అయితే బాగుంటుందని, ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయనకు ప్రమోషన్ కల్పించి, అధ్యక్ష పీఠం అప్పగిస్తే రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్‌వైపు వస్తారని అధిష్ఠానం ముందు గట్టిగా చెప్పినట్టు సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎటువైపు మొగ్గుచూపుతారోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.