calender_icon.png 29 July, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కండువా మార్చిన గూడెం డీలా పడిన నీలం

20-07-2024 12:18:09 AM

ప్రత్యర్థులు ఒకే పార్టీలో చేరడంతో కార్యకర్తల్లో అసంతృప్తి

మహిపాల్‌ను వ్యతిరేకించే కాంగ్రెస్‌లో నీలం మధు చేరిక

ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో క్యాడర్‌లో వ్యతిరేకత

పటాన్‌చెరులో తగ్గుతున్న మధు ప్రభావం

నియోజకవర్గంలో పెరుగుతోన్న గ్రూప్ రాజకీయాలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 19 (విజయక్రాంతి): నవ్వినోళ్ల ముందట బోర్ల పడినట్లుగా ఉంది పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఓ నాయకుడు తీరు. తన రాజకీయ జీవి తంలో ఏ నాయకుడైతే తన ప్రత్యర్థిగా భావించారో, ఏ నాయకుడిని నిత్యం వ్యతిరేకించాడో, ఏ నాయకుడి చేతిలో చిత్తుగా ఓడిపోయారో ప్రస్తు తం ఆ నాయకుడి పంచనే చేరి తన పరువు తానే తీసుకుంటున్నారు.

సర్పంచ్‌గా ఉండి ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అని, ముదిరాజ్ బిడ్డగా బీసీ కార్డుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మారి బీఎస్‌పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయనకు సుదీర్ఘకాలంగా ప్రత్యర్థిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం, తన ప్రత్యర్థి చేరికను దగ్గరుండి ఆయనే స్వాగతించడంతో ఆయన రాజకీయ జీవితం డీలా పడినట్లుంది. ఆయన్ను నమ్ముకున్న నాయకులే ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఇంత కు ఆ నాయకుడి పేరు చెప్పలేదు కదా.. నీలం మధు. ఆయన ప్రత్యర్థి పేరు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. 

ఇద్దరూ గులాబీ గూటి పక్షులే...   

కొన్నినెలల కిందటి వరకు నీలం మధు పటాన్‌చెరులోని చిట్కుల్ గ్రామ సర్పంచ్. కానీ అక్కడి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున్నట్లుగా ఉండేది పరిస్థితి. ఈటల రాజేందర్‌ను బీఆర్‌ఎస్ బహిష్కరించడంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు అదే కోటాలో బీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారు. అప్పటికే ఆర్థికంగా స్థిరపడిన ఆయన తనకు బీసీ కోటాలో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించారు. మహిపాల్‌రెడ్డికి దీటుగా పెద్దపెద్ద నేతలను పిలిచి సభలు పెట్టారు. ఎంఎన్‌ఆర్ యువసేన పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మీడియా సంస్థలకు రూ.కోట్ల ప్రకటనలు ఇచ్చారు. చివరి నిమిషంలో మహిపాల్‌కే బీఆర్‌ఎస్ బీఫాం ఇవ్వడంతో మధు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ అక్కడా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీఫాం నిరాకరించడంతో చివరకు బీఎస్‌పీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. 

మళ్లీ కాంగ్రెస్‌లోకి ఆ ఇద్దరు...

ఎంపీ ఎన్నికలకు ముందు నీలం మధు మళ్లీ కాంగ్రెస్‌లో చేరి చివరి నిమిషంలో మెదక్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఓటమి పాలైనప్పటికీ మధు క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు. అయితే మహిపాల్ కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ సమయంలో నీలం మధు దగ్గర ఉండి స్వాగతించడం పటాన్‌చెరులో చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు కలవడంతో కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిపాల్‌రెడ్డి చేరికను వ్యతిరేకించాల్సిన మధు అతని పంచన చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మహిపాల్ చేరికతో నీలం మధు రాజకీయం డీలా పడినట్లేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్ నుంచి మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్, బీఎస్‌పీ నుంచి నీలం మధు పోటీ చేశారు. వీరంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే మధుతో పాటు మహిపాల్‌రెడ్డి చేరికను శ్రీనివాస్‌గౌడ్ వర్గం వ్యతిరేకిస్తూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ నిర్వహించిన రైతు రుణమాఫీ సంబురాల్లోనూ విభేదాలు బహిర్గతమయ్యాయి. శ్రీనివాస్‌గౌడ్‌కు అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో మధు కొంత ఇబ్బందికి గురయ్యారు.