సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
కామారెడ్డి (విజయక్రాంతి): సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. వచ్చే వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను రిజర్వాయర్ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కోరారు. రైతులకు వర్షాకాలం నీరు అందేలా పనులలో వేగం పెంచాలని కాంట్రాక్టర్ ను సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతపై స్థానిక నాయకులు చూసుకోవాలని సూచించారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలోని హనుమాజిపేట్ కోనాపూర్ శివారులో 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరంలో భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అధికారులను కాంట్రాక్టర్ లకు సూచించారు. ఆయనతో పాటు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.




