22-11-2025 01:04:41 AM
స్థానిక ఎన్నికలపై చర్చ
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25న సచివాలయంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు 2001 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కుల గణన డేటా ప్రకారం 50 శాతం కోటా మించకుండా డెడికేట్ కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ర్టవ్యాప్తంగా జరగనున్న ప్రజా వారోత్సవాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.