16 June, 2026 | 3:23 PM

రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలి

13-09-2025 06:32 PM

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి కన్వీనర్ శంకరయ్య ఆధ్వర్యంలో రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి శనివారం ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు.  రైతు రుణమాఫీ కోసం రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులు దీక్షలు చేయకుండా ప్రభుత్వం పోలీసులతో మైకులు తీయించడం, టెంట్లు కూల్చివేయడం ఒక విధంగా రైతుల మీద జులుం ప్రదర్శించడమేనని ఇది సరైన పద్దతి కాదన్నారు.

పోలీసులు ప్రజల కోసం పని చేయాలని నాయకులకు బానిసల్లా ఉండొద్దన్నారు. పత్రికలు, టీవీ ఛానళ్లు రైతు సమస్యలను చూపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు చేరేలా చేసి రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేసిన  ప్రభుత్వం మేడ్చల్, ఘట్ కేసర్, మూడుచింతలపల్లి రైతులకు ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చరిత్రలో లిఖించబడి ఉందని గుర్తు చేశారు.  రైతులకు రుణమాఫీ జరిగే వరకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. రైతులు చేసే ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తే రాబోయే రోజుల్లో రైతులు కర్రు కాల్చి వాతలు పెడతారన్నారు. రైతు రుణమాఫీ నిధులు దాదాపు రూ. 8 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్ని పార్టీల నుంచి మద్దతు రావడం మంచి పరిణామo అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి రైతు రుణమాఫీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.