16 June, 2026 | 4:38 PM

సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు

13-09-2025 06:32 PM

హనుమకొండ (విజయక్రాంతి): సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్సా జనార్దన్ అన్నారు. భారత న్యాయవాదుల సంఘం (ఐఎల్) వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి దుస్సా జనార్ధన్ హాజరై సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుస్సా జనార్ధన్ తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మాట్లాడుతూ సురవరం సుధాకర్‌రెడ్డి 1942, మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో జన్మించి దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారని, ఈ సందర్భంగా ఆయన నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తరువాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు.

సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌ గా కీర్తి గడించారన్నారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన తదుపరి 2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారని, పుదుచ్చేరి (2015), కొల్లాం(2018) మహాసభలో తిరిగి ఎన్నుకోబడిన సుధాకరరెడ్డి 2019 జులై 24న పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆరోగ్య కారణాలతో రిలీవ్‌ అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో  భారత న్యాయవాదుల సంఘం (ఐఎల్) భీమా నాదం శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల మహాత్మ, కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ,కొత్తపెళ్లి చిరంజీవి, రాష్ట్ర నాయకులు  ప్రముఖ న్యాయవాదులు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రీ, పాము రమేష్, రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.