10 August, 2026 | 11:47 PM

ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పంటలు: మంత్రి తుమ్మల

19-06-2024 01:22 PM

హైదరాబాద్: మ్యారీగోల్డ్ హోటల్ లో 41వ రాష్ట్రస్థాయి బ్యాంకార్ల సమావేశం బుధవారం జరిగింది.  ఈ సమావేశానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. బ్యాంకర్ల సమావేశంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అంశంపై కీలకంగా చర్చించారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పంటలు వస్తున్నాయని, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాకుకు బ్యాంకర్లు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని సూచించారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నాం కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందన్నారు.

బహుళజాతి, ఇన్ర్ఫా కంపెనీలకు రూ.వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారు? అని తుమ్మల ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయని, పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం ఉండకూడదని చెప్పారు. రైతులు వన్ టైం సెటిల్ మెంట్ చేయమంటే బ్యాంకర్లు స్పందించడం లేదని, నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.