15-10-2025 05:33:54 PM
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని మంత్రుల ఆదేశాలు..
సిద్దిపేట కలెక్టరేట్: రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, పౌరసరఫరా, మార్కెటింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశాలు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్యాడీ వినియోగంలో ముందంజలో ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లాంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయం చేసుకోవాలని, మిల్లర్లు ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందుగానే కేంద్రాల్లో సదుపాయాలు సిద్ధం చేయాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దీపావళి తర్వాత మొక్కజొన్న, సోయా పంటల కొనుగోళ్లు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కె.హైమావతి సమావేశం నిర్వహించి కొనుగోలు కేంద్రాల్లో తరచూ తనిఖీలు చేయాలని, గన్ని బ్యాగులు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, రైతుల బ్యాంకు వివరాలు, మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు సరి చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్యాడీ కొనుగోళ్లకు సంబంధించి సమస్యలు తలెత్తితే రైతులు హెల్ప్‌లైన్ నంబర్ 7995050809 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, సివిల్ సప్లై అధికారి ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, రవాణా అధికారి లక్ష్మణ్, మార్కెటింగ్ అధికారి నాగరాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య తదితర అధికారులు పాల్గొన్నారు.