పిచ్చి మొక్కల మధ్యలో మహనీయుల విగ్రహాలు
విగ్రహాల పరిసరాలను పట్టించుకోని అధికారులు : అనిల్ రెడ్డి
కూకట్ పల్లి, ఆగస్టు 22, (విజయక్రాంతి ): ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ చౌరస్తా వద్ద ఉన్న మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాల పరిసరాలు అధ్వానంగా మారడంపై శేరిలింగంపల్లి ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాల చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొనడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహనీయుల విగ్రహాలను గౌరవంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.
విగ్రహాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పిచ్చి మొక్కలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం. తక్షణమే అధికారులు స్పందించి సంబంధిత సిబ్బందితో విగ్రహాల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తాచెదారాన్ని పూర్తిగా శుభ్రపరచాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, క్రమం తప్పకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మహనీయుల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత, విగ్రహాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే ప్రజల తరఫున పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడుతామని తెలిపారు.






