calender_icon.png 10 October, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కోటాపై స్టే

10-10-2025 01:25:32 AM

జీవో 9 అమలును నిలిపిన రాష్ట్ర హైకోర్టు

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశం

ఆరు వారాలకు విచారణ వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ గురువా రం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధి స్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది.

దీనిపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి సం బంధించి గురువారం రెండోరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్ నాయకత్వంలోని ధర్మాసనం మధ్యా హ్నం భోజన విరామం తర్వాత విచారణ చేపట్టింది. 

సర్వే డేటా ఆధారంగానే..

విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయ ని పేర్కొన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మా నం ప్రకారమే సర్వే జరిగిందని తెలిపారు. బల హీనవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభు త్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనా భా ఉందని తేలిందని వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని చెప్పారు. ‘57.6 శాతం బీసీ జనా భా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పు డు పిటిషనర్లకు అభ్యంతరం ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలుపలేదు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే.. అప్పు డు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని అన్నా రు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందని తెలిపారు.

గవర్నర్ గడువులోపు ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు. వాదనల నేపథ్యంలో బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి సుదర్శన్ రెడ్డి సమాధానం చెబుతూ.. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించిందని స్పష్ట చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు.  కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనున్నది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహానీ కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. అది స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదు.

మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం. అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉంది. ఇది రాష్ట్ర ప్రజల కోరిక. దాన్ని అసెంబ్లీ ఆమోదించిం ది. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే జరిగింది. సర్వేలో అన్ని కులాల లెక్కలు తెలిశాయి. బీసీల్లోని సబ్ కేటగిరీల వారీగా వివరాలు సర్వేలో తేలాయి. అగ్రవర్ణాల లెక్కలు కూడా బయటకు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. కొందరు ఇది నోటిఫికేషన్ కాదంటున్నారు.

అది తప్పు’ అని ఏజీ వివరించారు. ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని  రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో 85 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 67శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

15 శాతం జనాభా ఉన్న ఓసీలకు 33 శాతం స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ‘తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతం మాత్రమే. ఆ 15 శాతం మందికి 33 శాతం సీట్లు ఇస్తున్నాం’ అని హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.