9 July, 2026 | 1:01 AM

ఆరోగ్య కారణాలతో విధులకు దూరం..

09-07-2026 12:05 AM

షాహిదా బేగం ఆత్మహత్యాయత్నం విషయం తెలియదు 

ఎమ్మార్వో నరేష్

ఎర్రవల్లి, జూలై 8: విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన ‘సార్.. ఒత్తిడి భరించలేము‘ కథనంపై ఎర్రవల్లి ఎమ్మార్వో నరేష్, సూపర్వైజర్ నరేష్ వివరణ ఇచ్చారు. ఎమ్మార్వో నరేష్ మాట్లాడుతూ, బాధితురాలు షాహిదా బేగం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం మాత్రమే తమకు తెలిసిందని, ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. షాహిదా బేగం బీఎల్‌ఓ విధులు నిర్వహించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమకు సమాచారం అందలేదని పేర్కొన్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా విధులకు హాజరు కావడం లేదని తెలిసిన వెంటనే, ఆమె స్థానంలో ప్రత్యామ్నాయ బీఎల్‌ఓను నియమించినట్లు వెల్లడించారు. షాహిదా బేగం విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ముందుగానే తమ దృష్టికి తీసుకొచ్చి ఉంటే, ఆమెకు అప్పగించిన బాధ్యతలను మరొకరికి అప్పగించే చర్యలు చేపట్టేవారమని తెలిపారు. విధుల నిర్వహణలో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు విచారణలో తేలితే, సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో నరేష్ స్పష్టం చేశారు.