calender_icon.png 3 February, 2026 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి

03-02-2026 12:58:21 AM

భూసారం పెరిగి పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది

రైతుల శిక్షణ ప్రారంభంలో కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): జిల్లాలోని రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులకు స్వస్తి పలికి, ప్రకృతి వ్యవ సాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన శాఖ లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ’ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని’ ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పండిస్తున్న ఉద్యాన పంటల సాగును కలెక్టర్ పరిశీలించగా, సాగు వివరాలు, స్ప్రింక్లర్ ల పనీ తీరును ఉద్యానవన పంటల శాస్త్రవేత్త మల్లేష్ ఆయన కు వివరించారు. అనంతరం శిక్షణ బ్రోచర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 2,500 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుండి ఎకరాకు ఏడాదికి 4,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందుతుందని, అలా గే మహిళా సంఘాల ద్వారా బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో క్లాసులతో పాటు క్షేత్రస్థాయి సందర్శనలు కూడా ఉంటాయని, శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు గ్రామాల్లోని రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా పశు వైద్యశాల అధికారి రామారావు, ఆత్మ పిడి రామ్ కిషన్, ఏవో శివకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్, రఘువీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రభావతి, రైతులు, ఇతర అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.