06-10-2025 08:24:12 PM
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..
హన్మకొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్, రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. గత ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధానం, నమోదైన కేసులపై పరిశీలన చేయాలని అధికారులకు, ఏసీపిలకు కమిషనర్ సూచించారు. రూట్ లు, జోన్ల వారిగా మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టు లను, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించిన అంశాలలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
రూట్ మ్యాపులను ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్ పోస్ట్, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు నియమించు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల, రూట్ ల ఏర్పాటు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. మండల స్థాయిలో సజావుగా ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.