09-07-2025 12:27:36 AM
పట్టించుకోని సింగరేణి యాజమాన్యం
మందమర్రి, జూలై ౮ : మందమర్రి ఏరియాలోని సింగరేణి కార్మిక కాలనీలలో పారిశుద్ధం అస్తవ్యస్తంగా మారి అపరిశుభ్రత రాజ్యమేలుతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు కార్మిక వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి. కార్మికుల సంక్షేమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు పట్టణంలోని మార్కెట్ ఏరియా, 1వ, 2వ, 3వ జోన్ లతో పాటు, ప్రాణహిత కాలనీ (షిర్కే), పాత బస్టాండ్ సమీపంలోని రామన్ కాలనీలలో కార్మికులకు గృహ వసతి ఏర్పాటు చేసి ఆయా కాలనీలలో మౌలిక సదు పాయాలు కల్పించింది.
కాలనీలలోని మురుగు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీలు నిర్మించినప్పటికీ డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు డ్రైనేజీల మురుగు నీరు నిలిచి దుర్గంధం వ్యాపించడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకా లం, ఆపై మురుగునీరు నిలిచి ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకేనా సంక్షేమం...?
సింగరేణి యాజమాన్యం కార్మికుల సం క్షేమ చర్యలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని గొప్పలు చెప్పుకుం టున్నప్పటికీ ఆచరణలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కార్మికుల సంక్షేమం కోసం గృహ వసతి, రోడ్లు, మంచినీరు వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలను సింగరేణి యాజమాన్యం కల్పించినప్పటికీ వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.
సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమ చర్యలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆచరణలో పూర్తిగా విఫలం అవడం పట్ల సింగరేణి కార్మిక సంక్షేమ కార్యక్రమాలు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా మారాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
శిథిలావస్థలో డ్రైనేజీలు...
కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా దశాబ్దాల క్రితం కార్మిక కాలనీలలో నిర్మించిన డ్రైనేజీలు శిథిలావస్థకు చేరడంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలకు నిలయాలుగా డ్రైనేజీలు మారాయని కార్మిక కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు.
శిధిలావస్థకు చేరిన డ్రైనేజీల స్థానంలో నూతన డ్రైనేజీలు నిర్మించి మురుగు నీరు నిలువకుండా చర్యలు చేపట్టాల్సిన యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి శిథిలావస్థకు చేరిన డ్రైనేజీల స్థానంలో నూతన డ్రైనేజీలు నిర్మించి పారిశుధ్యం మెరుగు పరచాలని పలువురు కోరుతున్నారు.
సంక్షేమంపై దృష్టి సారించాలి
సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలి. కార్మిక సంక్షేమం కోసం యాజమాన్యం గొప్ప ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆచరణలో ఆశించిన మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదు. కార్మిక కాలనీలలో పారిశుద్ధం మెరుగు పరిచి శిథిలమైన డ్రైనేజీల స్థానంలో నూతన డ్రైనేజీలు వెంటనే నిర్మించి కార్మిక కుటుంబాల ఇబ్బందులను తొలగించాలి.
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి