calender_icon.png 9 July, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రకు.. మన ఎరువులు

09-07-2025 12:29:45 AM

  1. అధిక ధరకు కక్కుర్తి పడి కృత్రిమ కొరత సృష్టిస్తున్న అక్రమార్కులు...

యూరియా కోసం అన్నదాతల పడిగాపులు.. 

పట్టించుకోని అధికారులు

ఆదిలాబాద్, జూలై 8 (విజయక్రాంతి): వ్యవసాయ పనుల ఆరంభం లో అన్నదాతలకు అవసరమయ్యే ఎరువుల అక్రమ దందా జిల్లాలో యదేచ్ఛగా కొనసాగుతోంది. మన ఎరువులు మహారాష్ట్ర లు పక్కదారి పడుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. అక్రమార్కులు జిల్లాకు కేటాయించిన యూరియా ను అక్రమ మార్గంలో మహారాష్ట్ర కు తరలిస్తుండడంతో అన్నదాతలు ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదుర య్యింది.

ఎరువుల అక్రమ దందా యదేచ్ఛగా సాగుతోందనడానికి పక్షం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల వాహనాలు పట్టుబడటం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లాలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు లభించక స్థానిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కొందరు వ్యాపారులు అక్రమంగా పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇటీవల భీంపూర్ మండలంలోనూ ఓ ఎరువుల లారీ పట్టుబడగా.. తాజాగా బేల మండలం నుం డి మహారాష్ట్రకు అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వాహనాలను స్వయంగా రైతులే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు జైనూర్ మండల కేంద్రంలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డు ఎక్కారు...

ఎరువులు దొరక్క ఇబ్బందులు...

ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 17వేల మెట్రిక్ టన్నుల యూరియా, 13,500 మె.టన్నుల డీఏపీ, 15250 మె.టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాధనలు పంపించగా.. ప్రభుత్వం ఆ మేరకు సరఫరా చేసింది. తొలుత రైతులు సులువుగానే ఆయా ఎరువులు తీసుకెళ్లినప్పటికీ.. కొన్ని రోజుకుగా మళ్లీ అవసరం మేరకు దొరకడం లేదు.

దీంతో రైతులు ఎరువులు దుకాణాలు, పీఏసీఎస్ సెంటర్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల తలమడుగు మండలం పల్లి (బి) లో రైతులు ఎరువుల కోసం ఆధార్ కార్డులను క్యూ లైన్ లో పెట్టి వేచిచూడాల్సిన ఘటనలు, నార్నూర్ మండలంలో గంటల తరబడి క్యూ లైన్ లో రైతులు నిలబడ్డ ఘటనలు, తాజాగా మంగళవారం జైనూర్ మండలంలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

అధిక ధరలకు ఆశపడి...

ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం యూరియా బస్తా రూ.269కి లభిస్తే అదే బస్తా మహారాష్ట్రలో రూ.400 వరకు ధర పలుకుతోందని తెలుస్తోంది. మరోపక్క అక్కడి ప్రభుత్వం పంటలకు యూరియాను ఎరువుల రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో వేయాలని నిబంధనలు విధించింది. లిక్విడ్ రూపంలోనే పంపిణీ చేస్తోంది. దీంతో ఈ రకంగా పంటలకు ఎరువులు పట్టించడం ఇష్టం లేని అక్కడి రైతులు ఇక్కడ లభించే ఎరువులను వేసేందుకు మొగ్గచూపుతున్నారు.

దీంతో ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉండే అక్కడి గ్రామాల రైతులు ఎక్కువగా ఇక్కడి యూరియా, డీఏపీ వంటి ఎరువులను తీసుకెళ్తున్నారు. అక్కడి కొందరు వ్యాపారులతో మద్య దళారులు ఒప్పందం చేసుకొని మాట్లాడి బస్తా రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలు రావడంలో కొందరు అక్రమ వ్యాపారులు వాహనాల ద్వారా అక్రమంగా ఎరువులను తరలిస్తున్నట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

మన ప్రభుత్వం యూరియా ను పీఏసీఎస్ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుండగా.. మిగితా ఎరువులను ఫర్టిలైజర్ దుకాణాల ద్వారానూ విక్రయాలు చేస్తోంది. కొందరు వ్యాపారుల కాసుల కక్కుర్తి పడి ఇక్కడి ఎరువులను పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం భీంపూర్ మండల కేంద్రంలో దాదాపు 200 క్వింటాళ్లపైన ఎరువులను అధికారులు పట్టుకోగా..

తాజాగా బేల మండలంలో 150 బస్తాల ఎరువులను పట్టుకున్నారు. ఇలా రోజూ అక్రమ మార్గంలో మహారాష్ట్ర కు సరఫరా కావడం మూలంగా స్థానిక రైతులకు ఎరువులు లభించని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.