యూఎస్ ఫెడ్ వైపు మార్కెట్ చూపు

29-04-2024 12:34:12 AM

వడ్డీ రేట్ల కోతలపై ఇన్వెస్టర్ల ఆసక్తి

నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితం

ముంబై, ఏప్రిల్ 28: నాలుగు రోజుల ట్రేడింగ్‌కే పరిమితమైన ఈ వారంలో మార్కెట్‌ను పలు అంశాలు ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెపుతున్నారు. మే 1 బుధవారం మే డే సందర్భంగా మార్కెట్లకు సెలవు. అదే రోజు రాత్రి యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, భవిష్యత్ సంకేతాలు వెల్లడికానున్నాయి. యూఎస్ వడ్డీ రేట్ల కోతలో జాప్యం జరుగుతుందన్న భయాలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సంగతి తెలిసిందే. అందుచేత ఇన్వెస్టర్లు మే 1న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లపై వెల్లడించే అభిప్రాయాల కోసం వేచిచూస్తున్నారు. ముగిసిన వారంలో తొలి నాలుగు రోజులూ పెరిగిన భారత్ స్టాక్ సూచీలు శుక్రవారం పడిపోయిన సంగతి తెలిసిందే.

అయితే వారం మొత్తం మీద 2 శాతం లాభంతో ముగిసాయి. ఇక  ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను ప్రధానంగా ఫెడ్ నిర్ణయం నిర్దేశిస్తుందని, ఇతర దేశీయ, అంతర్జాతీయ అంశాలు సైతం సూచీలను హెచ్చుతగ్గులకు లోనుచేస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌స్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. యూఎస్ ద్రవ్యోల్బణం పెరగడం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి 1.6 శాతానికే పరిమితంకావడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అదేపనిగా విక్రయాలు జరపడం గత శుక్రవారం మార్కెట్ పతనానికి కారణాలని విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఎఫ్‌పీఐల యాక్టివిటీ మార్కెట్‌కు కీలక అంశంగా ఉంటుందని, వారి పెట్టుబడుల ట్రెండ్‌ను ఇన్వెస్టర్లు గమనించాలని సూచించారు. 

ఫెడ్ కమిటీ మీటింగ్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల సమావేశం ఏప్రిల్ 30 మంగళవారం మొదలవుతుంది. సమావేశపు నిర్ణయాలు మే 1న వెల్లడవుతాయి. ఈ దఫా ఎఫ్‌ఓఎంసీ ఫెడ్ ఫండ్స్ రేటును యథాతథంగా అట్టిపెడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతల్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంపై ఫెడ్ అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి మార్కెట్ ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నది. జూన్ పాలసీలో 25 బేసిస్ పాయింట్ల కోత ఉంటుందంటూ కొద్ది నెలలుగా కొనసాగుతున్న అంచనాలకు ఇటీవల వెలువడిన అమెరికా ఆర్థిక గణాంకాలు దెబ్బకొట్టిన నేపథ్యంలో తాజా ఫెడ్ వ్యాఖ్యానం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.