అదానీ కనెక్స్ రూ.11వేల కోట్ల నిధుల సమీకరణ

29-04-2024 12:29:52 AM

2030 కల్లా దేశంలో 9 డేటా సెంటర్ల ఏర్పాటు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న అదానీ కనెక్స్ అంతర్జాతీయ బ్యాంక్‌ల నుంచి భారీగా నిధులు సమీకరించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎడ్జ్ కనెక్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన అదానీ కనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (రూ.11,520 కోట్లు) నిధుల్ని సమీకరించినట్టు ఆదివారం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ వచ్చే మూడేండ్లలో డాటా సెంటర్ వ్యాపారంలో 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వెల్లడించింది.

దేశంలో డిజిటల్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ కంపెనీ ఎడ్జ్‌కనెక్స్‌తో నెలకొల్పిన జాయిం ట్ వెంచర్ 2030కల్లా 1 గిగావాట్ల సామర్థ్యంతో తొమ్మిది డాటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. డాటా సెంటర్ల నిర్మాణానికి తాజాగా గ్లోబల్ బ్యాంక్‌ల నుంచి సేకరిస్తున్న నిధులతో పాటు తమ వద్ద మొత్తం 1.65 బిలియన్ డాలర్ల ఫైనాన్స్ సిద్ధంగా ఉన్నట్టు అదానీ కనెక్స్ తెలిపింది.

హైదరాబాద్ డాటా సెంటర్ నిర్మాణం రెండొంతులు పూర్తి

 ప్రస్తుతం కంపెనీకి చెన్నైలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక డాటా సెంటర్ ఉన్నది. నోయిడా, హైదరాబాద్ సెంటర్ల నిర్మాణం దాదాపు మూడింట రెండు వంతుల నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ప్రారంభంకానున్న తమ డాటా సెంటర్లు అత్యాధునిక టెక్నాలజీలు, పునరుత్పాదక ఇంధన సొల్యూషన్స్‌తో నడుస్తా యని కంపెనీ వెల్లడించింది.