03-12-2025 10:15:05 AM
వీధికుక్కల కట్టడిపై సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) స్పందించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పత్రికల్లో వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు.బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు.
తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ మండలం హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో మంగళవారం వీధి కుక్కలు ఎనిమిదేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేసిన విషయం తెలిసిందే. పి. ప్రేమ్‌చంద్ అనే ఆ బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కుక్కల గుంపు అతనిపై దాడి చేసింది. ప్రేమ్‌చంద్ దాడి చేయడాన్ని గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. అతన్ని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. తరువాత తదుపరి చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.