నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
తనిఖీల్లో పలు లోపాలు గుర్తించిన ఆహార భద్రతా అధికారి
కామారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): వర్షాకాలంలో వాహక జనిత అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా కొన్ని ఆహార వ్యాపార సంస్థల్లో మూతలు లేకుండా ఆహార పదార్థాలను నిల్వ చేయడం, అపరిశుభ్రమైన వంటశాలలు నిర్వహించడం, ఆహార తయారీ సిబ్బందికి ఆరోగ్య ధృవపత్రాలు లేకపోవడం, గ్లౌజులు మరియు హెడ్ క్యాప్లు ధరించకపోవడం వంటి లోపాలు గుర్తించారు. సంబంధిత యాజమాన్యాలకు వెంటనే లోపాలను సరిదిద్దాలని సూచించారు.
వర్షాకాలంలో దోమలు, ఈగలు వం టి వాహకాల ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆహార భద్రతా అధికారి హెచ్చరించారు. హోటల్, రెస్టారెంట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమలు, ఈగలు వంటివి ఆహార పదార్థాల వద్ద చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహార పదార్థాలను తప్పనిసరిగా మూతలతో భద్రపరచాలి. సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే వినియోగించాలన్నారు. వంట, వడ్డన సిబ్బంది పరిశుభ్రమైన దుస్తులు, గ్లౌజులు, హెడ్ క్యాప్లు ధరించాలన్నారు. చెత్తను ప్రతిరోజూ మూత ఉన్న డస్ట్బిన్లలో సేకరించి సకాలంలో తొలగించాలి. నిర్దేశించిన ఆహార భద్రతా ప్రమాణా లను పాటించని సంస్థలపై ఆహార భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్ హెచ్చరించారు.






