1 April, 2026 | 8:19 PM

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత

01-04-2026 06:29 PM

7 ట్రాక్టర్లు సీజ్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మొత్తం ఏడు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. కాగజ్‌నగర్ పెద్ద వాగు ప్రాంతం నుంచి రెబ్బెన మండలం రాంపూర్ గ్రామానికి ఎలాంటి అనుమతి పత్రాలు, ట్రాక్టర్ డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఆసిఫాబాద్ మండల పరిధిలో పెద్ద వాగు సమీపంలో తనిఖీలు నిర్వహించిన ఆసిఫాబాద్ ఎస్సై జాడే శ్యామ్‌రావు, కమలాకర్ నేతృత్వంలోని పోలీసు బృందం మరో నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేసింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సహజ వనరులను దోపిడీ చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.