25-08-2025 12:00:00 AM
ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు
మెదక్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ర్యాగింగ్ లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 1997 నుండి అమల్లో ఉన్న ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్ ఒక క్రిమినల్ నేరమన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు, విద్యాసంస్థల నుండి తొలగింపు, భవిష్యత్తులో విద్యాఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
సీనియర్లు జూనియర్లను వేధించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు. ప్రతి కళాశాలలో యాంటీర్యాగింగ్ కమిటీలు, స్వ్కాడ్లు ఏర్పాటు చేయాలని, కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాపులు నిరంతరంగా నిర్వహించాలని, విద్యార్థుల ఫిర్యాదు కోసం డయల్ 100 లేదా మెదక్ పోలీస్ కంట్రోల్ రూమ్ 91 87126 57888 నంబర్కు ఫిర్యాదు చేయాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు.