25-08-2025 01:51:15 AM
శేరిలింగంపల్లి, ఆగస్టు 24(విజయక్రాంతి): రాష్ర్టంలో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనరత వేటు కత్తి వేలాడుతుందని.. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బై బై ఎలక్షన్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల తీర్పుపై నిజంగా నమ్మకం ఉంటే కాంగ్రెస్‌లోకి దూకిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపాలని సవాల్ విసిరారు.
ఇరవై నెలల పాలనలో రేవంత్ చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రజల్లోకి వెళ్లి చూపించాలని, లేదంటే అసలు ధైర్యం లేదని ఒప్పుకోవాలని అన్నారు. ఎప్పటికైనా కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
పదేళ్ల అభివృద్ధి వర్సెస్ 20 నెలల గజిబిజి
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించి, హైదరాబాద్‌ను తెలంగాణ గుండెకాయగా తీర్చిదిద్దారని కేటీఆర్ గుర్తుచేశారు. పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిపి తెలంగాణను సరికొత్త దశలోకి తీసుకెళ్లారని చెప్పారు. అదే కాంగ్రెస్ పాలనలో ఇరవై నెలలకే రియల్ ఎస్టేట్ దందాలు, హైడ్రా అల్లర్లు, గూండా రాజ్యం మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నాయకులు రియల్ ఎస్టేట్‌లో వేలు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం కబ్జాలు, దందాలతో నాయకులు విరుచుకుపడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులతోనే రేవంత్ పాలన నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పది సంవత్సరాల్లో రూ.2.85 లక్షల కోట్లు అప్పు చేస్తే.. రేవంత్‌రెడ్డి కేవలం ఇరవై నెలల్లోనే రూ.2.20 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. కానీ ఆ అప్పుతో రాష్ట్రానికి ఏం మిగిలిందని ప్రశ్నించారు.
కేసీఆర్ కాలంలో 42 ఫ్లుఓవర్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు వచ్చాయని, రేవంత్ పాలనలో ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కనిపించిందా అని కేటీఆర్ నిలదీశారు. రైతుల ఖాతాల్లో కేసీఆర్ రూ.70 వేల కోట్లు జమ చేశాడని, కానీ రేవంత్ మాత్రం భాగా అప్పు చేసి, ప్రజలకు ఒక్క రూపాయి ప్రయోజనం చూపించలేకపోయాడు” అని ఎద్దేవా చేశారు.
హైడ్రా దమ్ము కేవలం పెద్దలపైనే?
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో సీఎం రేవం త్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు మాత్రం నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల అక్రమాల ముందు హైడ్రా వణుకుతోందని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాలకే హైడ్రా వాడబడుతోందని మండి పడ్డారు.
ప్రజల కోసం కాదు.. స్వలాభం కోసం
కాంగ్రెస్‌లోకి దూకిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాదు.. తమ స్వలాభం కోసం మాత్రమే వెళ్లారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ఒక రోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు తన మీద పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ హైదరాబాద్‌కు ఆయన చేసిందేం ఉంది? అని ప్రశ్నించారు.
నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని, అదే తమ బలం అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మాటలకన్నా కర్తవ్యమే ముఖ్యమన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచి చూపాలని, అప్పుడే మీకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోగలరని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.