25-08-2025 02:05:24 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ఆగస్టు 24 (విజయక్రాంతి): కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్ వద్ద సురవరం సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. సెల్యూ ట్ చేసి అంజలి ఘటించారు.
అనంతరం సుధాకర్‌రెడ్డి పార్థీవదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంపై ఉంచి అంతిమయాత్రను ప్రారంభించారు. సీపీఐ ‘రెడ్ ఆర్మీ’ వలంటీర్లు, ఎర్రజెండాలు చేతబూని వాహనం ముందు కవాతు చేస్తూ నడిచారు. అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా గాంధీ మెడికల్ కళాశాల వరకు దారిపొడవునా వందలాది మంది సీపీఐ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు ‘జోహార్.. కామ్రేడ్ సుధాకర్‌రెడ్డి’, ‘అమర్ రహే! కామ్రేడ్ సుధాకర్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు.
చివరకు అంతిమయాత్ర గాంధీ మెడికల్ కళాశాల వద్ద ముగిసింది. కుటుంబ సభ్యులు అక్కడ వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సురవరం సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పంగించారు.
నిబద్ధతకు మారుపేరు సురవరం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నిబద్ధతకు మారుపేరు, విలువలకు, నిరాడంబర జీవితానికి నిలువుటద్దం సురవరం సుధా కర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడిన మహా కమ్యూనిస్టు యోధుడని అభివర్ణిం చారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం (మఖ్దూం భవన్)లో శనివారం కుటుం బ సభ్యులు, పార్టీ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీవ దేహాన్ని సందర్శనకు ఉంచగా, సీఎం అక్కడికి విచ్చేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు తీరని లోటని పేర్కొన్నారు. సురవరం ప్రాతినిధ్యం వహించిన ప్రజాఉద్యమాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయని శ్లాఘించారు. విద్యార్థి దశలోనే సురవరం రాజకీయా లకు ఆకర్షితుడయ్యాడని, అలా ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. చివరి శ్వాసవరకు రాజీలేకుండా సిద్ధాం త విలువలను పాటించారని కొనియాడారు.
ఏడేళ్ల పాటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారని పేర్కొన్నారు. సురవరం ఏనాడూ అహంకారం, అహంభావాన్ని దరిచేరనివ్వలేదని కొనియాడారు. రాజకీయాల్లో ఆయన నడచుకున్న తీరు భావితరాల కూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డగా.. బూర్గుల రామకృష్ణారావు, జైపాల్‌రెడ్డి కోవలో జిల్లాకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు.
నీతి నిజాయితీతో తమ జీవితాలను ప్రజాసంక్షేమం కోసం వెచ్చించిన రాజకీ య నేతలను గౌరవించుకోవడం తమ ప్రభుత్వ విధానమని, అందుకే సురవరం అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామన్నారు. సురవరం మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సంతాపం తెలిపారని తెలిపారు. సీఎం వెంట సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, పార్టీ సీనియర్ నేతలు కే నారాయణ, కూనంనేని సాంబశివరావు ఉన్నారు.
సురవరం పార్థీవ దేహానికి నివాళి అర్పించిన వారిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, సీపీఐ, సీపీఎం జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు ఉన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన నేత: ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సురవరం సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. తన చిరకాల మి త్రుడిని విగత జీవుడిగా చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘకాలంగా సుధాకర్ రెడ్డితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సుధాకర్‌రెడ్డి కుటుంబ స భ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం సుధా కర్‌రెడ్డి కడదాకా నిలబడ్డారని కొనియాడారు.
ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: కేటీఆర్
సురవరం సుధాకర్‌రెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ పేర్కొన్నారు. సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహానికి నివాళి అర్పించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి స్థాయి నుంచి సుధాకర్‌రెడ్డి ఉద్యమాల్లోకి వచ్చారని, అప్పటి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఏడేళ్ల పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారని, అది సామాన్య విషయం కాదని అభిప్రాయపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. అలాంటి గొప్ప నేతను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
పవిత్రాత్మకుశాంతి కలగాలి: మాజీఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సురవరం సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుధాకర్ రెడ్డి తిరుగులేని ఉద్యమ నాయకుడని, ఉద్యమాల్లో ఆయన లేని లోటు పూడ్చ లేనిదని పేర్కొన్నారు. సురవరం పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన స్ఫూర్తిని నేటితరం కూడా ఆదర్శంగా తీసుకుని రాజకీయా ల్లో ఎదగాలని ఆకాంక్షించారు.