25-08-2025 02:11:11 AM
బీజేపీ ఉత్తరాది పార్టీ మాత్రమే కాదని నిరూపిస్తాం
పార్టీ మీడియా, ఐటీ, సోషల్ మీడియా రాష్ట్ర వర్క్‌షాప్‌లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్
హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ ఈటల
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): దేశమంతా ప్రస్తుతం తెలంగా ణ రాష్ర్టం వైపు చూస్తోందని.. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు మరింత బలపడుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బైరామల్‌గూడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ మీడి యా, ఐటీ, సోషల్ మీడియా వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రం లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజే పీ బలంగా ఎదుగుతోందన్నారు. ఈశా న్య రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలితంగానే ప్రజలు బీజేపీవైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
వికాస్, విరాసత్, గరీబ్ కల్యాణ్ యో జన.. ఈ మూడు అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ సహా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో ఆరింటిలో బీజేపీ అధికారంలోకి రావడం, మోదీ ప్రభుత్వ అభివృద్ధి వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రధాని మోదీ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ అనే నినాదంతో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణలో గత బీఆర్‌ఎస్ పాలన అవినీతి, కుంభకోణాలతో నిండిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఆ మాటను నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని.. కానీ మోదీ పాలన కుల, మత, ప్రాంత, భాష భేదభావం లేకుండా అందరికీ సమానంగా ఉందన్నారు.
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, నేడు వెనక్కి తగ్గుతున్నారని.. బీసీలను మోసం చేయటమే కాంగ్రెస్ ఉద్ధేశమన్న విషయం తేలిపోయిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్‌బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ బూత్‌లలో 8 లక్షల పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణలో సోషల్ మీడియా వారియర్స్ కూడా పోలింగ్ బూత్ స్థాయిలోనే నిర్మాణం చేసుకోవాలని.. తప్పనిసరిగా ఆఫీస్ బేరర్లను నియమించుకోవాలని సూచించారు.
వారియర్లు బాగా పనిచేయాలి: ఎంపీ ఈటల
సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియా బృందాలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపకుండా స్థానిక సంస్థలను నీరుగారుస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
సమాచారమే శక్తి: టీబీజేపీ చీఫ్ ఎన్ రాంచందర్‌రావు
ఈ రోజుల్లో సమాచారమే శక్తి అని.. ప్రజలు ఏది నిజమో, ఏది తప్పుడు సమాచారమో గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. అందుకే సరైన సమాచారం సరైన సమయంలో చేరేలా చూడటం బీజేపీ మీడియా, సోషల్ మీడియా, ఐటీ విభాగాల బాధ్యత అని తెలిపారు. ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందని.. ప్రతీ పౌరుడు ఒక మీడియా హౌస్ లాంటివాడన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రముఖ మాధ్యమంగా మారిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. వివిధ టీవీ ఛానళ్లలో, ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు, గత 11 ఏండ్లలో మోదీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఎన్నికలను వాయిదా వేస్తోందన్నారు.