25-08-2025 02:20:28 AM
రైతులకు తప్పని తిప్పలు
రాష్ట్రవ్యాప్తంగా అవే బారులు.. ఆందోళనలు
మహబూబాబాద్ జిల్లా రాయపర్తిలో 20 బస్తాల
యూరియాను ఇంట్లో దాచుకున్న సొసైటీ డైరెక్టర్
స్వాధీనం చేసుకున్న అధికారులు
మహబూబాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి)/నంగునూరు: యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉన్నది. విక్రయ కేంద్రా ల వద్ద అవే బారులు.. ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఆదివారం ప్రభుత్వ కార్యాల యాలకు సెలవు దినమైనప్పటికీ వ్యవసాయ శాఖ, సహకార శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని వివిధ మండ లాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు.
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామంలో యూరియా పంపిణీ కోసం శనివారం టోకెన్లు ఇవ్వగా ఆదివారం యూరియా రావడంతో రైతు వేదికలో టోకెన్లు ఇచ్చిన రైతులను కూర్చోబెట్టి వరుస క్రమంలో పంపిణీ చేశారు. ఇదే జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లిలో పోలీసు బందోబస్తు మధ్య రైతులకు వ్యవసాయ అధికారి వెంకన్న యూరియా పంపిణీ చేశారు.
నెక్కొండ మండలంలో యూరియా కోసం తెల్లవారుజామునే వందల మంది రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు వచ్చి బారులు తీరారు. ఇదే జిల్లా రాయపర్తిలో సొసైటీ డైరెక్టర్ ఒకరు 20 బస్తాల యూరియాను తన ఇంట్లో అక్రమంగా నిలువ చేసుకోగా విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే పర్వతగిరి మండల కేంద్రంలో ఉదయమే యూ రియా బస్తాల కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి క్యూ లో పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్‌లను పెట్టి గంటల తరబడి నిరీక్షించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం సుమారు 800 మంది రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు.
కానీ, అక్కడ అందుబాటులో ఉన్నది కేవలం 400 పైచిలుకు బస్తాలు మాత్రమే. సగం మందికి కూడా యూరియా దక్కని పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి నిరీక్షించి, యూ రియా దొరకదని తెలిసిన రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.తాము పడుతున్న కష్టా లు ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అంటూ రైతులు నినాదాలు చేశారు. “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కారు.