నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూన్ 8 (విజయక్రాంతి): జూన్ 21న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏబీవీ డిగ్రీ కళాశాలలో (396) మంది, పెంబర్తిలోని మహాత్మా జ్యోతి రావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో (192) మందితో కలిపి మొత్తం (58 8) మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. నీట్ పరీక్ష ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 వరకు ఉంటుందన్నారు.
అలాగే రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం (50) మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షా కేంద్రా ల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య శిబిరం, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాలను పరిశుభ్రం చేశాక, సీల్ చేయాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును సరిచూసుకోవాలన్నారు. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. పరీక్ష అయిపోయేంత వరకు ఎవరినీ బయటకు పంపకూడదన్నారు.
అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలన్నారు. బయో మెట్రిక్ విధానం సరిగా చేపట్టాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించాకే పరీక్ష హాలుకు అనుమతించాలన్నారు. అలాగే హాల్ టికెట్ల ను జాగ్రత్తగా పరిశీలించి, అభ్యర్థులను కేంద్రం లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు.
ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమ ల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. అదే విధంగా ప్రశ్న, జవాబు పత్రాలను ఎస్కార్ట్ తో నిర్దేశిత ప్రదేశాలకు చేర్చాలన్నారు.అభ్యర్థులు పరీక్షకు సమయానికి ముందుగానే చేరుకోవాలని, అనుమతించని వస్తువులు తీసుకు రాకూడదని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో నీట్ పరీక్ష సిటీ కో-ఆర్డినేటర్ ఎబివి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రవీంద్ర నాయక్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






