1 September, 2026 | 9:12 AM

నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేస్తే కఠిన శిక్షలు

14-03-2025 12:11 AM

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.రజిని.

పెబ్బేరు, మార్చి 13: నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేస్తే చట్టపరమైన కఠిన శిక్షలు తప్పవని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి. రజిని తెలిపారు. గురువారం పెబ్బేరు మండలం జనుంపల్లి గ్రామంలోని రైతువేదిక భవనంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులకు రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే లక్ష్యంగా విత్తన చట్టం 1966 రూపొందించబడిందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మిన, నకిలీ విత్తనాలను ఉత్పత్తి చేసిన కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల సదుపాయాలను అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు.

పెబ్బేరు మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు పొందడానికి అవసరమైన అర్హత ధ్రువ పత్రాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య, అగ్రికల్చర్ డైరెక్టర్ శివ నాగిరెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ షేక్ మున్న, టి.జి.బి బ్యాంక్ మేనేజర్ రవీందర్ నాయక్, ఏ.ఈ.ఓలు జయశ్రీ, ఆంజనేయులు, ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.