07-08-2025 06:30:24 PM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడి ప్రారంభం..
కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కలెక్టర్..
ముస్తాబాద్ (విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 20 కోట్లతో జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 170 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
అన్ని భవనాలు రానున్న ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించామని వివరించారు. అంగన్వాడీల కోసం నూతన భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. పిల్లలు ఆడుతూ.. పాడుతూ విద్యను అభ్యసించే అవకాశం వస్తుందని వివరించారు.పక్కా భవనాలతో అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని ఇబ్బందులు తొలగిపోతున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
విద్యకు మూలం అంగన్వాడి కేంద్రాలే..
విద్యకు మూలం అంగన్వాడీ కేంద్రాలేనని కే కే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 98 అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రీ ప్రైమరీ విద్య బలంగా ఉంటేనే మిగతా విద్యా అభ్యాసానికి ఇబ్బందులు రావని వివరించారు. నూతన అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇంకా ఎక్కడైనా అంగన్వాడీ కేంద్రం అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అసంపూర్తిగా నిలిచిన భవనాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో కార్పోరేట్ స్థాయి శిక్షణను ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.గత ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి డిజిటల్ తరగతులు నిర్వహించెందుకు కృషి చేస్తుండన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి స్థానిక నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్ రెడ్డి,గజ్జల రాజు శ్రీనివాస్,నర్సింలు అధికారులు అంగన్వాడి ఉపాధ్యాయురాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.