calender_icon.png 9 December, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు

09-12-2025 06:30:23 PM

జిల్లా ఎస్పీ నితిక పంత్.. 

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు వాంకిడి, కేరమేరి, జైనూర్, సిర్పూర్(యు), లింగపూర్ మండలాల్లో 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ బందోబస్త్ సంసిద్దంగా ఉందని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సైలెంట్ పీరియడ్ అమలు పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.

ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్‌ వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పహార, నిఘా బృందాలు, రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ తో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి విడత ఎన్నికల కోసం 550 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 200 మంది ఇతర శాఖల సిబ్బంది మొత్తం 750 మందిని నియమించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. మొదటి ఎన్నికలు పూర్తయ్య వరకు జిల్లాలో 163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా ఆ పైగా వ్యకులు గుంపులు గుమికూడరాదు.

అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు అక్కడ సమూహాలుగా ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు స్వచ్ఛంగా, ప్రశాంతంగా జరగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.