31 July, 2026 | 9:29 AM

రైతన్నలపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం: కేటీఆర్

28-05-2024 04:03 PM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై జరిగిన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ చేయటం అత్యంత దారుణం అన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్నదాతలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమేనని ఆరోపించారు. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

రైతులపైన లాఠీ చార్జ్ చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులపై లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది, మరోవైపు విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందని ఆయన విమర్శించారు. ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతన్నల కష్టాలు తొలగించాలని కోరారు. రాష్ట్ర రైతన్నలకు అండగా ఉంటాం, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున విస్తృతమైన నిరసన కార్యక్రమాలకు పిలునిస్తామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.