14 April, 2026 | 2:29 AM

తండా నుంచి ఢిల్లీకి.. సాఫ్ట్‌బాల్ పోటీలకు గట్లమల్యాల విద్యార్థిని

14-04-2026 12:36 AM

నంగునూరు, ఏప్రిల్ 13: సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఓ విద్యార్థిని తన అసాధారణ ప్రతిభతో దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బి. అర్చన, 69వ ఎస్.జి.ఎఫ్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది.

అక్కిన్నపేట మండలం నందరం పరిధిలోని పూసల తండాకు చెందిన బానోతు జ్యోతి తిరుపతి దంపతుల కుమార్తె అయిన అర్చన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గట్లమల్యాల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదువుకుంటూ అక్కడి బాలికల వసతి గృహంలో నివసిస్తోంది.ఇటీవల మహబూబాబాద్లో నిర్వహించిన అండర్-14 రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో,ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు తరఫున ఆడిన ఆమె,తన జట్టు ద్వితీయ స్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించింది.

ఈ అద్భుత ప్రతిభ ఆధారంగా ఆమెను జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల ఏప్రిల్ 16 నుంచి 22 వరకు ఢిల్లీ వేదికగా జరగనున్న పోటీల్లో అర్చన తన సత్తా చాటనుంది.తండా నుంచి వచ్చి జాతీయ స్థాయికి ఎంపికవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని  ప్రోత్సహించి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు డి. రాజ్ కుమార్ కు, ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్, సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ,స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.