25 August, 2026 | 1:10 AM

అనుమతి లేని గ్లోబల్ మైండ్ పాఠశాల ముందు విద్యార్థి సంఘాల ధర్నా

25-08-2026 12:06 AM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): పట్టణంలో అనుమతులు లేకుండా గ్లోబల్ మైండ్ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్, బీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. పాఠశాలకు గుర్తింపు లేని పేరును ఉపయోగిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో తరచూ పాఠశాలలో తరగతులు నిలిచిపోతున్నాయని తెలిపారు.

ఆందోళనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు గ్లోబల్ మైండ్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. అనుమతి పొందిన పాఠశాల పేరుకు బదులుగా ఇతర పేరు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి దేవా నాయక్ తెలిపారు. పాఠశాలను సీజ్ చేసి, యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, బీఆర్‌ఎస్వీ నాయకులు పంగ మహేందర్, ఆకినపెళ్లి శివ, భూక్య హరీష్, మహేశ్వర్, గుడికందుల లక్ష్మణ్, కొమ్ము హరీష్, తిరుపతి, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.