13 August, 2026 | 4:28 AM

చరిత్ర ఘనం.. నేడు సమస్యల మయం

13-08-2026 01:49 AM

ఆరు దశాబ్దాలుగా అనేకమంది భవిత దిద్దిన పాఠశాల

నేడు ఇరుకు గదులతో విద్యార్థుల అవస్థలు

భువనగిరిలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇది పరిస్థితి.

వసతులు కల్పించి పునర్వైభవం తీసుకురావాలని పలువురు వేడుకోలు

భువనగిరి, ఆగస్టు12: ఒకప్పుడు 1200 మందివిద్యార్ధులతో కళకళలా డిన పాఠశాల అది. ఎప్పుడూ విద్యార్థులతో నిండి ఉండగా అక్కడ పనిజేసిన ఉపాధ్యాయులు సైతం  నిబద్ధతతో పనిచేయడంతో గతంలో ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇక అదే సెంటిమెంట్ గా మారింది. ఈ పాఠశాలలో చదివిన వారికి మంచి భవిష్యత్ ఉంటుంది అనేది వినిపించడంతో ఇదే ప్రచారం బాగా సాగింది దీంతో గతంలో ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు పోటీ పడేవారు.

వెరసి నాడు ఈ పాఠశాల విద్యార్ధులతో కిటకిటలాడేది. ప్రస్తుతం పిల్లలు ఉన్నప్పటికీ ఆస్తులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి చరిత్ర ఘనం ప్రస్తుతం సమస్యల మయంగా మారింది ఆ పాఠశాల పరిస్థితి. ఇంతకీ ఆ పాఠశాల ఏదీ.. ఎక్కడ ఉందనుకుంటున్నారా.. అదే.. భువనగిరి జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రాంతంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల.

ఒకే ఆవరణలో ప్రాథమిక,  ఉన్నత పాఠశాలలు : 

భువనగిరి జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రాంతంలో మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు రెండు ఒకే ఆవరణలో ఉన్నాయి. అయితే ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతుండగా ఐదు తరగతి గదులు వారికి కేటాయించడం జరిగింది. అలాగే గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  380 మంది విద్యార్థులకు 9 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పాఠశాలలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండడం గమనించదగ్గ విషయం.                                                      

తరగతి గదులు లేక ఇబ్బందులు : 

గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ జిల్లాలో ఈ పాఠశాలలో చదివే విద్యార్ధులు బాగానే ఉంటారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదు వందల మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్నారు. కానీ తరగతి గదులు మాత్రం వారికి సరిపడా లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సమస్యతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. ఇక ఇదే పాఠశాల పీఎం శ్రీ పాఠశాలకు ఎంపిక కావడం గమనార్హం.

ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర :  

1960వ దశకంలో ఏర్పాటు అయిన ఈ పాఠశాల దశాబ్దాల తరబడి అనేక మంది పిల్లలతో సజావుగా నడిసింది. కానీ ప్రైవేట్ పాఠశాలల ప్రభావంతో కొంత మేర ప్రాధాన్యత తగ్గినప్పటికీ ప్రస్తుతం సుమారు  500 మంది విద్యార్థులు ఇందులోనే చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.  

ఒకే గదిలో రెండు తరగతులు :

పాఠశాలలోని ఆరో తరగతిలో 80 మంది విద్యార్థులు ఉండగా సౌలభ్యంకోసం వానిని  ‘ఎ’, ‘బి’ సెక్షన్ లుగా విడగొట్టారు. అయితే తరగతి గదులు సరిపడా లేని కారణంగా ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులే చెబుతున్నారు. అయితే ఒకే గదిలో రెండు తరగతులకు చెందిన విద్యార్థులకు బోధన జరగడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు  విద్యార్థులు ఇద్దరికి బోధించే పాఠాలపై. మనస్సును లగ్నం చేయడం కష్టతరంగా మారుతుంది అని వారే చెబుతున్నారు.

ఇక మరుగుదొడ్లు, నీటి వసతులు అంతంత మాత్రమే. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో గదుల్లో కూర్చునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది అందరికి తెలిసి ఆ విషయమే..  వేసవి, వర్షాకాలంలో ఇరుకు గదుల్లో విద్యార్థులు మరింత అవస్థలు పడుతుండటం గమనార్హం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాలను పరిశీలించి, అవసరమైన మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారి తల్లిదండ్రులు, విద్యావంతులు కోరుతున్నారు.