13 August, 2026 | 2:51 AM

పగటిపూట ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

13-08-2026 01:49 AM
  1. రూ.73 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
  2. ఒకే రోజులో కేసు చేధించిన పోలీసులు 
  3. వివరాలు వెల్లడించిన గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్

గణపురం,ఆగస్టు 12 (విజయ క్రాంతి) : పగటిపూట ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన నిందితుడిని గణపురం  ఎస్‌ఐ బొరగల అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి రూ.73 వేల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌ఐ బొరగల అశోక్ వెల్లడించారు.

మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన దానం సమ్మయ్య ఈ నెల 10న మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా కనిపించాయి. బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు కట్ట వద్ద కొండాపూర్కు చెందిన పుట్ట రమణాకర్ (30)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుండి 2.4 గ్రాముల బంగారు చెవి దుద్దులు, 12.05 గ్రాముల బంగారు గొలుసు, 20 తులాల వెండి పట్టీలు, కడియాలు స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.73 వేలు. ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. చోరీకి గురైన మొత్తం సొత్తు విలువ సుమారు రూ.80 వేలు కాగా, మరో రూ.7 వేల విలువైన ఒక గ్రాము బంగారు ముక్కుపుడక ప్రయాణంలో అనుకోకుండా పోయిందని నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేవలం ఒకేరోజులో చోరీ కేసును గణపురం పోలీసులు ఛేదించారు.