1 August, 2026 | 1:05 AM

ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు

01-08-2026 12:00 AM

నల్గగొండ టౌన్, జూలై 31 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిఫ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం, బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కళాశాలలు బహిష్కరించి ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు.

పెండింగ్లో ఉన్న రూ.11వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజులు కట్టలేదన్న కారణంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే 5 లక్షల మందితో హైదరాబాద్ నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

  • బీజేపీ యువ మోర్చా కన్వీనర్ ఏపూరి గణేష్

కోదాడ, జూలై 31 : తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోదాడ అసెంబ్లీ భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ ఏపూరి గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడలోని కిట్స్ కళాశాలలో విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపూరి గణేష్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలలో జాప్యం కారణంగా అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు  కొండ్లే రవి కుమార్,  రణబోతు వెంకటరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ,  కోదాడ మండల ప్రెసిడెంట్ గాదరి పుల్లారావు,  అసెంబ్లీ సహా ఇంచార్జ్ రౌతు కళ్యాణ్, మీడియా ఇంచార్జి చేదెళ్ల సతీష్, బడవత్ రమేష్, ఆలేటి సాయి కృష్ణ, చల్ల శివ, రౌతు చందు  భారతీయ జనతా యువ మోర్చా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ధర్నా

సూర్యాపేట, జూలై 31 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్కుమార్ ఆదేశాల మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, అలాంటి రాష్ట్రంలో ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో అనేక కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉన్నత విద్య కోసం వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

బకాయిలను విడుదల చేయక పోతే తమ సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్, టీఆర్వీఎస్ జిల్లా అధ్యక్షులు మడిపెల్లి సాయితేజ, యశ్వంత్, మనోజ్, ఉమేష్, చింటు రమ్య, లక్ష్మి, ప్రణవి, నరేష్ సతీష్, శశిప్రీతం తదితరులు ఉన్నారు.