13-05-2025 11:30:45 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్దం చేయాలని, ఉపాధ్యాయులతోనే సమాజ మార్పు సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ మండలం తీగల్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉత్తమమైన, ఆదర్శనీయమైన సమాజ స్థాపనలో విద్యార్థులను సిద్దం చేయవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు.
విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ సాధన కేవలం ఉ పాధ్యాయులతోనే జరుగుతుందని, మంచి ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులను తయారు చేయగలుగుతారని, సామర్ధ్యాల పెంపుకై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, తాను నేర్చుకుంటూ విద్యాబోధన చేసినప్పుడే విద్యార్థులలో గుణాత్మకమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు నూతనమైన విషయాలను తెలియజేస్తాయని, ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో అందిస్తున్న అంశాలను ఆకళింపు చేసుకొని పాఠశాల స్థాయికి తీసుకువెళ్ళి విద్యార్థులలో ఆశించిన మార్పుల సాధన లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, కోర్స్ డైరెక్టర్ జి. రామన్న, రిసోర్స్ పర్సన్లు మహేష్, రాజేశ్వరి, రమేష్, రాజన్న, వివిధ మండలాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.