30 July, 2026 | 12:51 AM

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి

30-07-2026 12:00 AM

మహబూబాబాద్, జులై 29 (విజయక్రాంతి):ఆత్మ విశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకు సాగాలని, అలాంటప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ విద్యార్థులకు పి లుపునిచ్చారు. చెడు వ్యాసనాలకు దూరంగా ఉంటూ విద్యాభ్యాసంపై పూర్తి దృష్టి సారించాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ఎంఏ ఆధ్వర్యంలో బాలాజీ గార్డె న్స్ లో నిర్వహించిన పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తి కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ముందుగా విద్యార్థులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే విధంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడప డం వల్ల జరిగే ప్రమాదాలు, సురక్షిత రవా ణా విధానాలపై ప్రత్యేక వీడియోలను ఎల్‌ఈడీ స్క్ప్రీ ప్రదర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలంటే చట్టాలను గౌరవిస్తూ, భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు,ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానిని సాధించేందుకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మనియంత్రణతో నిరంతరం శ్రమించాలని సూచించారు. జీవి తంలో విజయాలను సాధించడంలో సెల్ఫ్ కంట్రోల్ (ఆత్మనియంత్రణ) అత్యంత కీలకమైన అంశమని తెలిపారు.

తన విద్యాభ్యా సం, యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచు కుంటూ, తన జీవితంలో తన తండ్రే ప్రధాన స్ఫూర్తి, మార్గదర్శి, ప్రేరణగా నిలిచారని తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కష్టపడి చదవాలనే తపన, లక్ష్యంపై అచంచలమైన దృష్టి ఉంటే ఏ విద్యార్థైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని పేర్కొన్నారు..లక్ష్యాన్ని సాధించాలం టే ఎల్లప్పుడూ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచిస్తూ, 100 మీటర్లను రికార్డు సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యం ఉంటే, ముందుగా 1000 మీటర్ల సాధన చేయాలి. అప్పుడు అసలు లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులభమవుతుంది‘ అని విద్యార్థులకు ఉదాహరణతో వివరించారు.

విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చెడు అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. మంచి ఆలోచనలు, మంచి స్నేహితులు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం విజయానికి బాటలు వేస్తాయని తెలిపారు.