కేజీబీవీల్లో చదువుకు బ్రేక్
నిర్మల్ (విజయక్రాంతి): సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఉద్యోగులు సోమవారం సమ్మె ప్రారంభించడంతో నిర్మల్ జిల్లాలో కేజీబీవీలో విద్యార్థుల చదువుకు బ్రేక్ పడింది. జిల్లాలో మొత్తం 19 కేజీబీవీలు ఉండగా ఎస్‌వోలతో పాటు కాంట్రాక్టు టీచర్లు సమ్మె చేయడంతో పాఠశాలల నిర్వహాణపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పాఠశాలల్లో విదులు నిర్వహించే వారిలో టీచింగ్ స్టాప్ మొత్తం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కావడంతో వారంతా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.
ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల రక్షణ దృష్ట్యా ఇద్దరు ఉపాద్యాయులు నాన్ టీచింగ్ స్టాప్ మాత్రమే విదులు నిర్వహించడం వల్ల విద్య భోధనలు జరగడం లేదు. ఒక్కోక్క పాఠశాలలో 230 వరకు బాలికలు ఉండడంతో టీచింగ్ సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. రేపటి నుండి ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో తమ డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ డిఈవో రామారావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోలు సూజాత, ఆపర్ణ, వీణా, లలిత తదితరులు ఉన్నారు.






