1 May, 2026 | 11:55 PM

కలం కార్మికులే సమాజానికి దిక్సూచి

01-05-2026 10:40 PM

◆ పనిగంటలకు అతీతంగా ప్రజాసేవలో నిత్యం అంకితభావం

◆ మే డే సందర్భంగా (కలం కార్మికులు) జర్నలిస్టులకు శుభాకాంక్షలు

◆ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్

ఖమ్మం: సమాజానికి కళ్లూ చెవుల్లా నిలిచే జర్నలిస్టులు పనిగంటలకతీతంగా ప్రజాహితానికి అంకితమై సేవలందిస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్- బీ - 2843) రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. మే డే దినోత్సవం సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలు గౌరవప్రదంగా, ఉత్సాహభరితంగా సాగాయి. ముందుగా జర్నలిస్టు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిజం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఒక బాధ్యత, ఒక త్యాగం, ఒక నిరంతర యజ్ఞమని పేర్కొన్నారు. సాధారణ కార్మికులకు ఎనిమిది గంటల పని పరిమితి ఉన్నప్పటికీ, జర్నలిస్టులకు మాత్రం సమయం అనే పరిమితి ఉండదన్నారు. అర్ధరాత్రి ఆపరాత్రి అనే తేడా లేకుండా,  ఆసుపత్రిలో బాధిత కుటుంబంతో ఉన్నా, సంఘటన స్థలంలో ఉన్నా.. ప్రజల కోసం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిన వృత్తి జర్నలిజమని స్పష్టం చేశారు.

కలం కార్మికులు సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా నిలుస్తారని, వారి కృషి లేకపోతే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుకోవడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర అపారమని, వారి అంకితభావం సమాజ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. అయితే, ఇంతటి సేవలందిస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తగిన జీతాలు లేకపోవడం, అక్రిడిటేషన్ కార్డుల ఆలస్యం, ఇండ్ల స్థలాల లేమి, హెల్త్ కార్డుల అవసరం, పిల్లలకు ఉచిత విద్య, వృద్ధాప్యంలో భద్రత కోసం పెన్షన్లు ఇలాంటి కీలక అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మే డే సందర్భంగా జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగితేనే తమ హక్కులను సాధించగలరని, ఐక్యతే వారి అసలైన బలం అని పిలుపునిచ్చారు. కలం శక్తి ఒకటైతే సమాజాన్ని మారుస్తుందనే విశ్వాసంతో అందరూ ఒకే వేదికపై నిలబడాలని సూచించారు. కలం కార్మికుల ఐక్యతే వారి బలం, వారి సేవే సమాజానికి వెలుగని అన్నారు.

* మధుసూధన్ కు టీడబ్ల్యూజేఎఫ్ నివాళి

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్ఓ మధుసూదన్ జర్నలిస్టుగా ఖమ్మం జిల్లాలో అనేక సేవలందించారని, వారి అకాల మరణం జర్నలిస్టు లోకాన్ని కలచివేచిందని, మధుసూదన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మధుసూదన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.