calender_icon.png 9 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ కాలం తీరే వేళ స్టడీ టూరా?

08-01-2026 01:53:19 AM

  1. పర్యటనల పేరిట విహార యాత్ర!

బీచ్‌లో ఏటీవీ రైడ్లు, సెల్ఫీలతో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల బిజీ

రూ.10 కోట్ల ప్రజాధనం వృథా

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): మరో నెల రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు ముగియనుంది. నగరం లో పరిష్కారం కాని సమస్యలెన్నో ఉన్నా యి. సరిగ్గా ఈ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు స్టడీ టూర్ పేరుతో చేపట్టిన పర్యటన విహారయాత్రగా మారింది. నగరంలో చెత్త నిర్వహణ, నదుల సుందరీకరణ వంటి కీలక అంశాలను గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నేర్చుకుంటామని చెప్పి వెళ్లిన కార్పొరేటర్లు.. జల్సాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత నేతృత్వంలోని ఈ బృందం అధ్యయనం కంటే ఆనం దం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది. అహ్మదాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఘన వ్యర్థాల నిర్వహణ, సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ పద్ధతులను పరిశీలించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

కానీ మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన కార్పొరేటర్ల బృందం అహ్మదాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తోంది. సముద్ర తీరంలో సేద తీరుతూ, బీచులలో ఏటీవీ బైకులు నడుపుతూ, గ్రూప్ ఫోటోలకు ఫోజులిస్తూ విహారయాత్రను ఆస్వాది స్తున్నారు. ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు గుజరాత్ పర్యటనను పక్కనపెట్టి, పొరుగున ఉన్న రాజస్థాన్‌కు వెళ్లడం గమనార్హం. వారు నేరుగా ప్రసిద్ధ అజ్మీర్ దర్గాను సందర్శించి, ఖాజా మొయినుద్దీన్ చిష్తీకి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో మునిగిపోయారు. 

నెల రోజుల్లో ఏం ఉద్ధరిస్తారు?

అసలు ఈ సమయంలో టూర్ ఎందుకన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి గడువు తీరనుంది. చేతిలో ఉన్నది కేవలం 30 రోజులు మాత్రమే. ఈ తక్కువ సమయంలో వారు అక్కడ కొత్తగా ఏం నేర్చుకుం టారు, నేర్చుకున్న విషయాలను నివేదికగా ఎప్పుడు రూపొందిస్తారు, దాన్ని కౌన్సిల్‌లో పెట్టి ఎప్పుడు ఆమోదిస్తారు, నిధులు మంజూరు చేసి ఎప్పుడు అమలు చేస్తారు? ఇవన్నీ సాధ్యం కాని పనులు. అయినా ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికే వెళ్లారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

కుటుంబ సభ్యులతో యాత్ర

అధికారిక పర్యటనల్లో కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే పాల్గొనాలి. కానీ, ఈ టూర్‌లో కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు దర్శనమిస్తున్నారు. చాలా మంది కార్పొరేటర్లు తమ భర్తలు, పిల్లలు, సోదరీమణులను వెంటబెట్టుకెళ్లారు. విమాన ప్రయాణాలు, స్టార్ హోటల్ వసతులు, ఏసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రజాధనంతో కుటుంబాలకు విందులు చేస్తున్నా రా.. లేక కుటుంబ సభ్యుల ఖర్చును వారు సొంతంగా భరిస్తున్నారా అన్నదానిపై జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. రెండు విడతలుగా సాగుతున్న ఈ యాత్రకు దాదాపు రూ.10 కోట్ల వరకు ప్రజాధనం వృధా అవుతోందని అంచనా. 

రెండో బ్యాచ్ కూడా రెడీ

మొత్తం 146 మంది కార్పొరేటర్లలో ప్రస్తుతం సుమారు 40 మంది మేయర్‌తో కలిసి వెళ్లారు. వీరి పర్యటన ముగియగానే, ఈ నెల 16వ తేదీన మరో విడత రెండో బ్యాచ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మొదటి బ్యాచ్ తీరు చూస్తుంటే.. రెండో బ్యాచ్ కూడా ఇదే దారిలో నడిచి, అధ్యయనం పేరుతో ఎంజాయ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేటర్ల తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.