ఉపాధ్యాయులు సంఘ సేవకు పునరంకితమవ్వాలి
సీపీఐ జాతీయ నేత చాడా వెంకట్‌రెడ్డి
ఘనంగా ఎస్టీయూటీఎస్ 80వ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): గత ఎనిమిది దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణే ధ్యేయంగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్‌టీయూటీఎస్) నిరంతరం పనిచేస్తోందని సీపీఐ జాతీయ నాయకులు చాడా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన సంఘం 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. సంఘ పతాకావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో చాడా వెంకట్‌రెడ్డి పసంగించారు. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలతో పాటు, విద్యాభివృద్ధి కోసం కూడా పాటుపడాలని సూచించారు. ఎస్టీయూ సం ఘం స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పడిన తొలి ఉపాధ్యాయ సంఘమని కొనియాడారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సంఘం పనిచేస్తోందన్నారు.
నేడు ఉపాధ్యాయులు పొందుతున్న అనేక హక్కులు, సౌకర్యాలు ఎస్టీయూ పోరాటాల ఫలితమేనన్నారు. నాటి రాష్ట్ర బాధ్యులు రాఘవాచారి, శ్యాంసుందరరావు వంటి నాయకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఆ పదవులకు గౌరవాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు సంఘ సేవకు పునరంకితమై విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) అమలు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, అలాగే 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
సర్వీస్ రూల్స్ సాధించి, ఉపాధ్యాయులకు ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పదోన్నతులు కల్పించడమే ఎస్టీయూ ధ్యేయమని పేర్కొన్నా రు. కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎం. పర్వత్ రెడ్డి, ఆర్. శివశంకర్, హెడ్‌క్వార్టర్స్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముకుంద్ రావు, బషీరొద్దీన్, మహ మ్మద్ అలీ, పున్న గణేష్, వివిధ జిల్లాల ప్రతినిధులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.






