16 May, 2026 | 2:08 AM

సమస్యల పరిష్కారానికి ఉప కమిటీ

16-05-2026 12:00 AM

సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలకు మధ్య సినిమాల ప్రదర్శనల విషయమై నెలకొన్న వివాదంలో ఇరువర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. దీనిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు నేతృత్వంలో శుక్రవారం థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు సమావేశమ య్యారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు, సీ కల్యాణ్, బాపినీడు, స్రవంతి రవికిషోర్, రాధామోహన్, చెరుకూరి సుధాకర్, రవిశంకర్, సుప్రియ యార్లగడ్డ, ఠాగూర్ మధు, సాహు గారపాటి, సతీశ్ కిలారు, నాగవంశీ, ఎస్‌కేఎన్, రాజేశ్ దండా, ధీరజ్ మొగిలినేని సహా దాదాపు 50 మంది హాజరయ్యారు.

ఎగ్జిబిటర్ల తరపున విజయేందర్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వాడీవేడిగా జరిగిన ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు వర్గాల సమస్యలపై సమగ్రంగా చర్చించను న్నారు. ప్రధానంగా పర్సంటేజీ, రెంటల్ సిస్టమ్, ఓటీటీ విండో అంశాలు చర్చకు వచ్చాయి. చివరగా పర్సంటేజీ విధానంపై ఉప కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించిన ఫిల్మ్ చాంబర్.. ఈ ఉప కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

రసాభాస.. 

ఫిల్మ్ చాంబర్‌లో సమావేశం ఆరంభంలో రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన తర్వాత 10 నిమిషాలపాటు రచ్చరచ్చ జరిగింది. సునీల్ నారంగ్, నాగవంశీ వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. ఇద్దరూ పరస్పరం గట్టిగట్టిగా అరుచుకున్నారు. దిల్ రాజు కల్పించుకొని, వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. చివరకు సునీల్ నారంగ్ మధ్యలోనే సమావేశం హాలు నుంచి వెళ్లిపోయారు. కొందరు నిర్మాతలు నచ్చజెప్పి మళ్లీ సమావేశానికి తీసుకొచ్చారు.  

‘పెద్ది’ విడుదలకు అడ్డంకులుండవ్: దిల్ రాజు

‘పెద్ది’ సినిమా జూన్ 4న ఆరోగ్యకర వాతావరణంలోనే విడుదలవుతుందని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. “ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్ జరిగింది. సమస్యలపై చర్చించి, పరిష్కరించుకున్నాం. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటుకానుంది. ఏ, బీ, సీ.. ఇలా ఆయా సెంటర్లలోని థియేటర్‌ను బట్టి పర్సంటేజీని కమిటీ నిర్ణయిస్తుంది” అని తెలిపారు. 

కమిటీ సభ్యులు వీరే..

ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య ఉన్న సమస్యల పరిష్కారం విషయమై ఓ ఉప కమిటీ వేశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కలిపి మొత్తం 26 మందితో ఉప కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దిల్ రాజు, డీ సురేశ్‌బాబు, అల్లు అరవింద్, కే అశోక్‌కుమార్, కేఎల్ నారాయణల మార్గదర్శకత్వంలో ఈ ఉప కమిటీ పనిచేయనుంది. ఈ ఉప కమిటీకి ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు డీ సురేశ్‌బాబు చైర్మన్‌గా, చాంబర్ గౌరవ కార్యదర్శి కే అశోక్‌కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. ఈ మూడు విభాగాల నుంచి ఏడుగురు చొప్పున ఇక ఈ ఉప కమిటీలో సభ్యులుగా నామినేట్ చేయాలని నిర్ణయించారు.

నిర్మాత రంగం తరఫున వై సురేందర్‌రెడ్డి, వై సుప్రియ, వై రవిశంకర్, బీ బాపినీడు, చెరుకూరి సుధాకర్, జీ శ్రీనివాస్‌కుమార్ (ఎస్‌కేఎన్), టీ ప్రసన్నకుమార్ సభ్యులుగా ఉంటారు. ఎగ్జిబిటర్ల విభాగం నుంచి వీ ప్రతాప్‌రెడ్డి, టీ బాల గోవింద్ రాజ్, కే అనుపమ్‌రెడ్డి, పీ శ్రీనివాస రావు, జీ వీరనారాయణ బాబు, కే వంశీ కిషోర్ (చిన్ని), ఎం విజేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ల విభాగం తరపున డీ విష్ణుమూర్తి, వీ వీరనాయుడు, ఎన్ సుధాకర్‌రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్ నాగార్జున, బీ మధుసూదన్‌రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలినేని సభ్యులుగా ఉంటారు.