ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్

28-04-2024 01:55:50 AM

గిఫ్ట్ డీడ్ కోసం రూ.10 వేల లంచం డిమాండ్

చొప్పదండి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ఆఫీస్ సబార్డినేట్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, ఫిర్యాదుదారుడు ఆకులు అంజయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన కొక్కుల రాజేశం అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులో గల సర్వే నంబర్ 131లో 486.42 చదరపు గజాల భూమి తన కుమారుడు కొక్కుల అజయ్‌కుమార్‌పై గిఫ్ట్ డీడ్ చేసేందుకు గత మూడు రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు.

భూమి రిజిస్ట్రేషన్ కోసం కొక్కుల అజయ్‌కుమార్ తన మిత్రుడు ఆకుల అంజయ్య ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వో సురేష్‌బాబును సంప్రదించగా, గిఫ్ట్ డీడ్ చేసేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నప్పటికీ అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధి తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం మధ్యాహ్నం సమయంలో భూమి రిజిస్ట్రేషన్‌కు ముందు ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వో సూచనల మేరకు అవుట్ సోర్సిం గ్‌లో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న కొత్తకొండ శ్రీధర్‌కు రూ.10 వేల నగదును అందిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సురే ష్ ఎబాబుతో పాటు ఆఫీస్ సబార్డినేట్ శ్రీధర్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.