గడువులోపు ఓటరు గణన పత్రం ఇవ్వండి
కాంగ్రెస్ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి
బడంగ్‌పేట్ జులై 13:(విజయక్రాంతి) నాదర్ గుల్ డివిజన్ ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్‌ఐఆర్ ఓటరు గణన పత్రాన్ని వెంటనే సమర్పించాలని ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి చెప్పారు.
సోమవారం ఆయన బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి బడంగ్ పేట్ సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ పరిధిలోని అల్మాస్ గూడ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఆఫీసర్ కేంద్రాలను సందర్శించి, ఓటరు గణన పత్రం యొక్క ప్రాధాన్యతను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాదర్ గుల్ 57వ డివిజన్ లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఓటర్లందరూ గత ఎన్నికల్లో తాము ఓటు వేసిన పోలింగ్ బూత్కు వెళ్లి, ఓటర్ ఐడీ కార్డును చూపించి ఓటరు గణన పత్రాన్ని తీసుకోవాలన్నారు. ఆ పత్రాన్ని పూర్తిగా నింపి తిరిగి సంబంధిత బిఎల్‌ఓ కే అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫారమ్ను పూరించడంలో ఏవైనా సందేహాలు ఉంటే అక్కడి అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దిండు శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






