సబ్సిడీ విత్తనాలు అందించాలి
రైతు వేదిక ముందు బీజేపీ ధర్నా
అక్కన్నపేట, జూలై 28: అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి నాయకత్వంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, వానాకాలం సాగు సీజన్లో రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
ప్రభుత్వం తగినంత సబ్సిడీ విత్తనాలను అందించడంలో విఫలమైందని, దీంతో రైతులు అధిక ధరలకు ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేసి అదనపు ఆర్థిక భారం భరిస్తున్నారని విమర్శించారు. రైతులకు సంబంధించిన ప్రభుత్వ సమాచారం, సబ్సిడీ విత్తనాల పంపిణీ వివరాలు, వ్యవసాయ పథకాల సమాచారాన్ని కేవలం వాట్సాప్ గ్రూపుల ద్వారా కాకుండా ప్రతి గ్రామంలో డప్పు చాటింపు ద్వారా తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో ప్రతి రైతుకు సమాచారం సకాలంలో చేరి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ సమానంగా అందుతాయని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లక్కిరెడ్డి తిరుమల, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షుడు జయదేశ్వరాచారి, కుంట స్వప్న, గంగుల కుమార్, సలేంధ్ర తిరుపతి, గిరిమల్ల రాజు, దార్న రాజు, కొండ్ల సంజీవరెడ్డి, బొంకూర్ రజనీకాంత్, కట్కూర్ ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేముగంటి తేజ, వడ్లూరి సృజన్, దయతరులు తదితరులు పాల్గొన్నారు.






